యెమన్ లో తొక్కిసలాట..80 మంది మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:యెమన్‍లో తీవ్ర విషాదం జరిగింది. రంజాన్  మాసం సందర్భంగా నిర్వహించిన ఓ దాతృత్వ కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 80 మందికిపైగా ప్రజలు చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. రంజాన్ మాసం ముగింపు రోజుల సందర్భంగా యెమన్‍ రాజధాని సనా  నగరంలో ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.పవిత్ర రంజాన్ మాసం ముగింపు రోజైన ఈదుల్ ఫితర్  పర్వదినానికి రెండు రోజుల ముందు యెమన్‍లో ఈ భారీ విషాద ఘటన జరిగింది. “కనీసం 85 మంది చనిపోయారు. 322 మంది గాయపడ్డారు” అని తొక్కిసలాట తర్వాత సనా జిల్లా హౌతి సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఓ స్కూల్‍లో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.ఒక్కొక్కరికి 5,000 యెమనీ రియాల్స్ (సుమారు రూ.740)ను పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు రాయిటర్స్‌తో చెప్పారు.

తొక్కిసలాట తర్వాత ఈ కార్యక్రమ నిర్వాహకులైన ఇద్దరు వ్యాపారులను అక్కడి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించాయి. తమ వారికి ఏమైందోనని చూసేందుకు వచ్చిన వారిని కూడా అక్కడికి అనుమతించడం లేదు. మృతదేహాలను, గాయపడిన వారిని అక్కడి అధికారులు, సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు.యెమన్‍లో జరిగిన ఈ తొక్కిసలాట విషాద దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో మృతదేహాలు పడి ఉన్నట్టు ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ఈ ఘటనలో వందలాది మంది గాయాల పాలయ్యారు.తమ వారిని చూసేందుకు ఆసుపత్రుల వద్దకు వందలాది మంది చేరుకుంటున్నారు. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకుంటున్నాయి.2014 అంతర్యుద్ధం తర్వాత యెమన్‍లో పేదరికం పెరిగిపోయింది. ఇరాన్‍ మద్దతిస్తున్న హౌతి రెబల్స్ ఆధీనంలో ప్రస్తుతం సనా నగరం ఉంది.

Leave A Reply

Your email address will not be published.