సెహభష్…  మధుస్మిత జెనా దాస్

లండన్, ఏప్రిల్ 19:బ్రిటన్‍లో ఉంటున్న భారతీయ మహిళ.. చీర ధరించి ఓ మారథాన్‍లో 42.5 కిలోమీటర్లు పరుగెత్తారు. మాంచెస్టర్‌లో జరిగిన మారథాన్‍లో ఒడిశాకు చెందిన ఆ మహిళ సంబల్‍పురి చేనేత చీరను ధరించి పాల్గొన్నారు. విజయవంతంగా మారథాన్‍ను పూర్తి చేశారు. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ 4 గంటల 50 నిమిషాల్లో 42.5 కిలోమీటర్ల మారథాన్‍ను పూర్తి చేశారు. అందమైన చీర, ఆరెంజ్ కలర్ స్నీకర్స్ ధరించి ఆమె మారథాన్‍లో పాల్గొన్నారు.మారథాన్‍లో ఒడియా మహిళ చీర ధరించి పరుగెత్తిన ఫొటోలను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “బ్రిటన్‍లోని మాంచెస్టర్‌లో ఓ ఒడియా మహిళ సంబల్‍పురి చీర ధరించి బ్రిటన్ రెండో అతిపెద్ద మాంచెస్టర్ మారథాన్ 2023లో పరుగెత్తారు. ఇదెంతో గొప్ప చర్య. ఆమె స్ఫూర్తి నాకు చాలా నచ్చింది!. సంబల్‍పూర్‌లో శతాబ్దాలుగా గిరిజనులు, జానపద కమ్యూనిటీకి చెందిన వారు కలిసి జీవిస్తున్నారు.

ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకమైన సమ్మిళిత సాంస్కృతి గుర్తింపు ఉంది. సామరస్యాన్ని, శాంతిని కొనసాగిద్దాం” అని ఆ యూజర్ పోస్ట్ చేశారు.ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ యూకే  కూడా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా.. చీర ధరించి మధుస్మిత ఎంతో సునాయాసంగా మారథాన్‍లో పరుగెత్తిన వీడియోను పోస్ట్ చేసింది. మారథాన్‍లో పాల్గొన్న ఆమెను స్నేహితులు, కుటుంబ సభ్యులు హర్షధ్వానాలతో ప్రోత్సహించడం ఆ వీడియోలో ఉంది.“మధుస్మిత జెనా.. బ్రిటన్‍లోని మాంచెస్టర్‌లో ఉంటున్న భారతీయురాలు. అందమైన సంబల్‍పురి చీరలో ఆమె ఎంతో సునాయాసంగా మాంచెస్టర్ మారథాన్ 2023లో పరుగెత్తారు. భారతీయ వారసత్వాన్ని ఆమె సగర్వంగా ప్రదర్శించారు. అలాగే భారతీయ వస్త్రధారణ గొప్పతనాన్ని కూడా చాటిచెప్పారు” అని ట్వీట్ చేసింది.మధుస్మిత జెనా దాస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మారథాన్లు, అల్ట్రా మారథాన్‍లలో పాల్గొన్నారు. తాజాగా మాంచెస్టర్ మారథాన్‍లో సంబల్‍పురి చీర ధరించి పరుగెత్తడం పట్ల ఒడిశాకు చెందిన వారు గర్వం చేశారు.

ఒడియా వారసత్వ సంపదను అంతర్జాతీయంగా ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే చీరలో పరుగెత్తడం చాలా కష్టమైన పని అంటూ కొందరు అన్నారు.చీరలో మారథాన్ పూర్తి చేసి, ప్రపంచానికి భారతీయ వస్త్రధారణను చాటిచెప్పిన మధుస్మితను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “వావ్.. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. ప్రపంచానికి మన సంస్కృతిని తెలియజెప్పాల్సిన తీరు ఇది. విదేశీ వస్త్రధారణకు మొగ్గుచూపుతున్న వారందరూ ఆమెను చూసి నేర్చుకోవాలి” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. “గొప్పగా అనిపిస్తోంది. యూఎస్ ఓపెన్‍లో ఆడుతూ పట్టా శారీ ధరించడం, ట్రియాథ్లాన్‍లో తషర్ సిల్క్ చీర ధరించి పాల్గొనడం చూస్తానని ఆశిస్తున్నా” అని మరో యూజర్ రాసుకొచ్చారు. మధుస్మిత పట్ల గర్వంగా ఉందని, ఆమె ఇలాగే ముందుకు సాగాలని మరికొందరు కామెంట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.