చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కాకినాడ:రోజు రోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత నుండి బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటైన చలివేంద్రాన్ని సద్వినియోగపరచుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ ఫణీంద్ర పేర్కొన్నారు. రమణయ్యపేట రాయుడుపాలెం జంక్షన్ లో శ్రీ విశ్వ కాంతి పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటైన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతున్నందున దాతలు ముందుకు వచ్చి మరిన్ని చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీ విశ్వ కాంతి పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులైన అడబాల శ్రీనివాస్ స్వర్ణ దంపతులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.