24 గంటల్లో ఆధారాలను బయటపెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా: నారా లోకేశ్
టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని… ఈ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పాత్ర కనిపిస్తోందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎప్పటి మాదిరే మరోసారి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిరాశలో కూరుకుపోయిన మీరు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంటూ కొత్త ఆరోపణలను తెరపైకి తెచ్చారని అన్నారు.
జగన్ కు, ఆయన అనుచరులకు తాను ఒకటే చెపుతున్నానని… మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల 8 నెలలు పూర్తయిందని…. తాను, తమ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని నిరూపించేందుకు మీరు ఇప్పటి వరకు శక్తివంచన లేకుండా శ్రమించారని, కనిపెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంటున్నారని… కుంభకోణం జరిగిందనే ఆధారాలను 24 గంటల్లో బయటపెట్టాలని సవాల్ విసురుతున్నానని అన్నారు. తన పరపతిని దెబ్బతీసేలా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయకుండా… బహిరంగంగా తనతో పోరాడి మగాడివని నిరూపించుకోవాలని అన్నారు.