ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి ప్రాణహాని

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామ దామోదర్ రెడ్డి
కామారెడ్డి:ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సామ దామోదర్ రెడ్డి మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సతీమణి మహేశ్వరి రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి రమేష్ లతో కలిసి మాట్లాడారు.  2016 సంవత్సరంలో కొంపల్లి లో తనకు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తానని నమ్మించి శంకర్ పల్లి లోని పలు సర్వే నెంబర్లు గల 113 ఎకరాల తన స్థలాన్ని మోసపూరితంగా అతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. దీంతోపాటు మరో 65 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు గూండాలచే తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

తన స్థలంలోకి ప్రవేశించకుండా ప్రవేట్ వ్యక్తులచే అడ్డు తగలడమే కాక మరోమారు వస్తే లారీలతో గుద్ది చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన మీడియా సాక్షిగా ఆరోపించారు.  అదే ప్రాంతంలోని తన తండ్రి పేరు పై ఉన్న ఫంక్షన్ హాల్ను సైతం కబ్జా చేశారని వాపోయారు. చివరకు ఆ ప్రాంతంలోని ఆలయాన్ని సైతం వదల్లేదని మండిపడ్డారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.

దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారి వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించగా జీవన్ రెడ్డికి వివాదాలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోతే జీవన్ రెడ్డి నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని తప్పదని కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ స్పందించకపోతే త్వరలో గవర్నర్ ను కలిసి తన పరిస్థితిని విన్నవించుకుంటానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.