మే 15 తర్వాత స్మృతి వనంలోకి అనుమతి
హైదరాబాద్, ఏప్రిల్ 20:హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మృతివనాన్ని నెల రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంబేడ్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో నిర్మించిగా…. ఆ విగ్రహం కింద ఉన్న పీఠం 50 అడుగుల ఎత్తులో ఉంది. పీఠం లోపలి భాగంలో 30 అడుగుల హాలును ఏర్పాటు చేశారు. ఇందులోని థియేటర్‌ను ఒకేసారి వందమంది కూర్చోడానికి వీలుగా రూపొందించారు. అయితే ఇక్కడ ప్రతిరోజూ ఆయన జీవితచరిత్రపై చలన చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. వాటికి సంబంధిత వివరాలను బీబీసీ టీవీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తదితర అనేక సంస్థల నుంచి సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.అలాగే మరో హాలులో ఆయన చిన్ననాటి నుంచి కీలక బాధ్యతల్లో ఉన్నప్పటి వరకు ఉన్న అరుదైన ఫొటోల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు.
పీఠం కింది భాగంలో హాలు నిర్మాణ పనులను మరో 20 రోజుల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్ అండ్ బీ అధికారి పేర్కొన్నారు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనాన్ని నిర్మించారు. అయితే ఇందులో మూడెకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన భాగంలో ఇంకా ల్యాండ్ స్కేపింగ్ పనులు చేయాల్సి ఉంది. వచ్చేనెల మధ్య నుంచి లేదా ఆ నెలాఖరు నుంచి ఈ కేంద్రంలోకి అధికారికంగా పర్యాటకులను అనుమతించాలని భావిస్తున్నారు . అయితే దీనికి టికెట్ పెట్టాలా లేక ఉచితంగానే అనుమతించాలా అన్న విషయంలో నిర్ణయంపై చర్చలు జరుగుతున్నాయి.